నీతి కథ : గురుదక్షిణ అంటే ఇలా ఉండాలి.. పిల్లలను చూసి ఉప్పొంగిపోయిన టీచర్

నీతి కథ : గురుదక్షిణ అంటే ఇలా ఉండాలి.. పిల్లలను చూసి ఉప్పొంగిపోయిన టీచర్

శేఖరం మాష్టారు ఒక మారుమూల పల్లెలో తెలుగు మాష్టారుగా పనిచేసేవాడు. ఆయనకు పిల్లలంటే చాలా ప్రేమ. పేద పిల్లలకు అవసరమైన పుస్తకాలు, పెన్నులు కొనిచ్చేవాడు. చక్కటి నీతి కథలు చెప్పేవాడు. పద్యాలు రాగయుక్తంగా పాడి నేర్పించేవాడు. అందుకే పిల్లలకు మాష్టారు అంటే చాలా ఇష్టం.శేఖరం మాష్టారు ఐదో తరగతి పిల్లలను దత్తత తీసుకొని వాళ్లకు అన్ని సబ్జెక్టులు అర్థమయ్యే విధంగా చెప్పేవాడు. పిల్లలందరూ బాగా చదువుకుని ప్రయోజకులు అవ్వాలని, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని బుద్ధి చెప్పేవాడు.

పిల్లలు పోటీపడి మరీ చదివేవాళ్లు. శేఖరం మాష్టారుకు అనుకోకుండా ప్రమోషన్ వచ్చింది. ఆ స్కూల్ వదిలి, వేరే స్కూల్​ కు వెళ్ళవలసి వచ్చింది. తమ అభిమాన గురువుకు వీడ్కోలు చెప్పే రోజున భోరున ఏడ్చేశారు. వాళ్లను ఊరుకోబెట్టడం ఆయనకు చాలా కష్టమైంది. ఎలాగో బుజ్జగించి.. "మీరు ప్రయోజకులైతే సంతోషించే మొట్టమొదటి వ్యక్తిని నేనే. నేను ఎక్కడున్నా మీరు బాగుండాలని కోరుకుంటా. మీరు కష్టపడి చదివి ప్రయోజకులమవుతామని నాకు మాటివ్వండి” అన్నారు. “సరే” అన్నారు పిల్లలు.

ఇలా చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక రోజు శేఖరం మాష్టారుకి ఫోన్ వచ్చింది. “మాష్టారు బాగున్నారా నన్ను గుర్తు పట్టారా?” అంటూ ఎవరో ఒక పద్యం చెప్పారు. వెంటనే శేఖరం మాష్టారు "నువ్వు శిరీష కదా” అనగానే “అవును మాష్టారు మీ ప్రోత్సాహంతో నేను గవర్నమెంట్ టీచర్ గాసెలెక్ట్ అయ్యాను” అని చెప్పింది. ఆమె చెప్పిన మాటలు ఎంతో సంతోషాన్ని తెచ్చిపెట్టాయి. శిరీష "మాష్టారు మీకు ఇచ్చిన మాట ప్రకారం మా క్లాస్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరం ఐకమత్యంతో కష్టపడి చదివి గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించాం. మా మాట నిలబెట్టుకున్నాం" అని చెప్పింది. ఆ మాటలు వింటుంటే శేఖరం మాష్టారు కళ్ళలో నుండి ఆనందభాష్పాలు రాలాయి.

"మాష్టారు మా తరగతి విద్యార్థులంతా మన స్కూల్లో  పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం. మీరే ముఖ్య అతిథిగా రావాలని చెప్పింది” శిరీష. “సరే”నని మాటఇచ్చాడు శేఖరం మాష్టారు. ఆ కార్యక్రమానికి వెళ్లిన మాష్టారుకు ఘన స్వాగతం లభించింది.

ఇచ్చిన మాట కోసం ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన తన విద్యార్థులను చూసి ఉప్పొంగి పోయారు. ఈ కార్యక్రమంలో మాష్టారు మాట్లాడుతూ.. జీతం పెరిగినపుడో, ఇంక్రిమెంట్ వచ్చినపుడో కలిగే సంతోషం కన్నా తన దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థులు ప్రయోజకులు అయితే కలిగే సంతోషం వెలకట్టలేనిది” అన్నారు. ఇదే గురువులకిచ్చే సరైన గురుదక్షిణ అంటూ తన స్టూడెంట్స్​ ను మెచ్చుకున్నారు.